స్మృతి ఇరానీకి ఏక్తాకపూర్ ప్రత్యేక పెళ్లిరోజు శుభాకాంక్షలు
- నేడు కేంద్ర మంత్రి 20వ వివాహ వార్షికోత్సవం
- సామాజిక మాధ్యమాల్లో పాత చిత్రం పోస్ట్ చేసిన ఏక్తాకపూర్
- ముగ్ధురాలైన స్మృతి ఇరానీ
- భర్తకు ఇరానీ ఆత్మీయ సందేశం
ఏక్తాకపూర్, స్మృతి ఇరానీల మధ్య సుదీర్ఘకాలంగా విడదీయరాని బంధం కొనసాగుతోంది. రాజకీయాల్లోకి రాకముందు బుల్లితెరపై నటించిన స్మృతి ఇరానీకి తొలుత అవకాశం ఇచ్చింది ఏక్తాకపూరే కావడం విశేషం. ‘క్యూంకీ.. సాస్ భీ కభీ బహూ థీ’ అనే ధారావాహిక ద్వారా ఆమెను బుల్లితెరకు పరిచయం చేశారు. అప్పటి నుంచి వారివురి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. స్మృతి ఇరానీని ఏక్తాకపూర్ ‘సోల్ సిస్టర్’(ఆత్మీయ సోదరి)గా అభివర్ణిస్తుంటారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ సైతం ఆమె భర్త జుబిన్‌కు సామాజిక మాధ్యమం వేదికగా ఆత్మీయ సందేశం పోస్ట్ చేశారు. 20 సంవత్సరాలుగా తమ మధ్య బంధం కొనసాగుతోందని గుర్తుచేసుకున్నారు. తాను ఓ సాధారణ గృహిణిగా కాకుండా కలల్ని సాకారం చేసుకోవడం కోసం నిరంతరం పరుగెడుతూ ఉన్నానని తెలిపారు. అయినప్పటికీ.. ఎంత గందరగోళ పరిస్థితుల్లోనైనా జుబిన్ ఒద్దికగా నడుచుకున్నారని అభిప్రాయపడ్డారు.
మరి అలాంటి వ్యక్తికి ధన్యవాదాలు చెబితే సరిపోతుందా? అని అన్నారు. అయితే, స్నేహంలో క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండవని వ్యాఖ్యానించారు. స్మృతి, జుబిన్ దంపతులది ప్రేమ వివాహం. ఆమె మోడల్‌గా ఉన్న సమయంలోనే వీరివురు ప్రేమలో పడ్డారు. 2001లో వివాహం చేసుకున్నారు.