సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులంతా వాలిపోయారు: మమతా బెనర్జీ
- నన్ను చంపేందుకు కుట్ర జరిగింది
- బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల గొంతుకను నొక్కేస్తారు
- గాయపడిన ఆడపులి చాలా ప్రమాదకరం
పశ్చిమబెంగాల్ లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని... ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల గొంతుకను నొక్కేస్తుందని మమత అన్నారు. వాస్తవానికి బీజేపీకి ప్రజల మద్దతు లేదని... అందుకే, జనాలను కొనుగోలు చేసి సభలకు రప్పిస్తున్నారని తెలిపారు. బీజేపీ తనను ఎంత వేధించినా లెక్క చేయనని... బెదిరించడం ద్వారా తనను ఆపలేరని అన్నారు. ఒంటి కాలితోనే తాను పోరాటం చేస్తానని అన్నారు. తన తల్లులు, కూతుళ్ల రెండు కాళ్ల సాయంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. గాయపడిన ఆడపులి చాలా ప్రమాదకరమని అన్నారు.
బెంగాల్ లో ఎక్కడ చూసినా కేంద్ర మంత్రులే కనిపిస్తున్నారని మమత అన్నారు. ఎన్నికల ప్రచారం తప్ప వారికి వేరే పనేమీ లేదా? అని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో, తుపాన్లు అతలాకుతలం చేసిన సమయాల్లో ఒక్క కేంద్ర మంత్రి కూడా కనిపించలేదని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే సిగ్గులేకుండా బెంగాల్ కు వచ్చేశారని దుయ్యబట్టారు.