Sayantika Banarjee: తృణమూల్ తీర్థం పుచ్చుకున్న బెంగాల్ సినీ నటి సాయంతిక

Bengal cine actress Sayantika Banarjee joins TMC
  • పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మార్చి 27 నుంచి 8 విడతల్లో పోలింగ్
  • రాజకీయ పార్టీల్లో చేరుతున్న బెంగాల్ సినీ ప్రముఖులు
  • సీనియర్ నేతల సమక్షంలో టీఎంసీలో చేరిన సాయంతిక
  • టీఎంసీలో చేరడం గౌరవంగా భావిస్తున్నానని వెల్లడి
పశ్చిమ బెంగాల్ లో ఆసక్తికర దృశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ తారలు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతూ సందడి చేస్తున్నారు. ఇటీవలే స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరగా, తాజాగా మరో నటి సాయంతిక బెనర్జీ అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోల్ కతాలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో సాయంతిక.... టీఎంసీ సీనియర్ నేతలు సుబ్రతా ముఖర్జీ, పార్థ ఛటర్జీ, బ్రత్య బసు సమక్షంలో టీఎంసీలో చేరారు.

ఈ సందర్భంగా సాయంతిక మాట్లాడుతూ, తాను ఎప్పటినుంచో మమతా బెనర్జీకి అభిమానినని, అన్ని వేళలా ఆమె వెంట నడవాలని భావిస్తానని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, అందుకే టీఎంసీలోకి వచ్చానని వివరించారు. టీఎంసీలో చేరడాన్ని గౌరవంగా భావిస్తానని, పార్టీ ఆదేశాల ప్రకారం ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.

కాగా, ఇతర నటులు యష్, పాపియా, పాయల్ తదితరులు బీజేపీలో చేరగా, కంచన్ ముల్లిక్, సయోనీ ఘోష్ వంటి తారలు, దర్శకుడు రాజ్ చక్రవర్తి అధికార టీఎంసీ పక్షాన చేరారు.
Sayantika Banarjee
TMC
Politics
Cinema
Mamata Banerjee
Assembly Polls
West Bengal

More Telugu News