వాట్సాప్ కు పోటీగా సందేశ్... అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం

Centre brings Sandes app after modifications to GIMS
  • ఇప్పటివరకు ప్రభుత్వ విభాగాలకు అందుబాటులో యాప్
  • జిమ్స్ గా గుర్తింపు
  • జిమ్స్ కు మార్పులు చేసిన ఎన్ఐసీ
  • సందేశ్ యాప్ గా రూపకల్పన
  • ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో సందేశ్
ఇప్పటివరకు ప్రభుత్వ విభాగాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించిన సందేశ్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ఇకపై సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో దీన్ని జిమ్స్ అని పిలిచేవాళ్లు. జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్ స్టాంట్ మెసేజింగ్ సిస్టమ్ అని అర్థం. దీన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేసింది. జిమ్స్ యాప్ లో పలుమార్పులు చేసిన ఎన్ఐసీ సందేశ్ గా మార్చి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

సందేశ్ యాప్ ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీ ఇస్తుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే నేరుగా జిమ్స్ వెబ్ సైట్ కు వెళ్లి దానికి సంబంధించిన ఏపీకేని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు సాయంతో సందేశ్ యాప్ లో ఖాతా ప్రారంభించి సేవలు పొందవచ్చు.

మెయిల్ ద్వారా ఖాతా ప్రారంభించాలంటే ఇప్పట్లో వీలు కాదు. ప్రభుత్వ అధికారిక మెయిల్ ఐడీలు ఉన్నవాళ్లు మాత్రమే మెయిల్ ఐడీ సాయంతో సందేశ్ ఖాతాలు ప్రారంభించవచ్చు. జీమెయిల్, యాహూ వంటి ప్రైవేటు డొమైన్ మెయిల్ ఐడీలకు సందేశ్ యాప్ అనుమతి నిరాకరిస్తుంది.

ఇది దాదాపుగా వాట్సాప్ అందించే సేవలన్నింటిని అందిస్తుంది. పైగా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత కూడా కల్పిస్తున్నారు. కాగా, త్వరలోనే కేంద్రం సంవాద్ అనే మరో మెసేజింగ్ యాప్ ను కూడా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూస్ ఫీడ్, మల్టీ యూజర్ చాట్ సెషన్స్, ప్రైవేటు సోషల్ నెట్వర్కింగ్ వంటి అదనపు ఫీచర్లు దీంట్లో ఉంటాయని తెలుస్తోంది.
Go Back to Shorts
Sansdes
App
Whatsapp
GIMS
NIC
India

More Telugu News