Supreme Court: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court dismiss AP Government petition on Purushothapatnam lift irrigation project
  • పురుషోత్తపట్నం పథకానికి పర్యావరణ అనుమతులు  తీసుకోవాలన్న ఎన్జీటీ
  • ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ సర్కారు
  • పోలవరంలో పురుషోత్తపట్నం పథకం అంతర్భాగమని వెల్లడి
  • ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ ఎత్తిపోతల పథకంపై పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ముందుకు వెళ్లాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు ఇవ్వగా, ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగ్గా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం  పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగమని ఏపీ సర్కారు వాదించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం పథకం తీరుస్తుందని వివరించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలు రద్దు చేయాలని కోరింది. దీనిపై జస్టిస్ నారిమన్ ధర్మాసనం స్పందిస్తూ.... అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

అటు, రాష్ట్ర హైకోర్టులోనూ ఏపీ సర్కారుకు నిరాశ తప్పలేదు. పోలవరం నిర్వాసితుల సమస్యపై దాఖలైన పిల్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పోలవరంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, విధానపరమైన అంశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్ కు సూచించింది. అధికారుల వద్ద సమస్యకు పరిష్కారం లభించకపోతే అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది.
Supreme Court
Purushothapatnam Lift Irrigation
Andhra Pradesh
NGT
AP High Court
Polavaram Project

More Telugu News