కాంబోడియాలో బీరు యోగా... ఆసక్తిచూపుతున్న యువత!
- కాంబోడియాలో లాక్ డౌన్ ఎత్తివేత
- బీరు సేవిస్తూ యోగా చేస్తున్న యువత
- ప్రోత్సహిస్తున్న బీరు కంపెనీ
- సంతోషంగా ఉందంటున్న యువత
కాంబోడియా ముఖ్యనగరం నామ్ ఫెన్ లో యువతకు ఇప్పుడీ యోగా బీర్ బాగా ఉపశమనం కలిగిస్తోంది. నలుగురితో కలిసి హాయిగా బీరు తాగుతూ, యోగా చేయడాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ప్రోత్సహిస్తోంది. బీరు యోగాతో తమకు ఎంతో వినోదం లభిస్తోందని స్రేలిన్ బచా అనే పాతికేళ్ల యువతి చెబుతోంది. స్నేహితులతో కలిసి బీరు తాగుతూ యోగా చేయడంతో ఎంతో సంతోషం కలుగుతోందని వివరించింది.
వాస్తవానికి ఇది అచ్చమైన యోగా సాధన కాదని, మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడపడమేనని, యోగాసనాలతో వినోదం అందిపుచ్చుకుంటున్నామని యోగా ఇన్ స్ట్రక్టర్ అన్నా తెలిపారు. ఆసియాలో చిన్నదేశమైన కాంబోడియా కరోనాను అత్యంత సమర్థంగా కట్టడి చేసింది. ఇక్కడ ఇప్పటివరకు 456 కేసులు మాత్రమే రాగా, 399 మంది కోలుకున్నారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ దేశంలో కేవలం 6 వారాలు మాత్రమే లాక్ డౌన్ విధించి ఆ తర్వాత సడలించారు.