America Hub: విశాఖలో అమెరికా హబ్... ఆసక్తి చూపుతున్న అగ్రరాజ్యం

US Government expresses interest to establish America Hub in Visakhapatnam
  • సీఎం జగన్ ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్
  • విశాఖలో హబ్ ఏర్పాటుకు సంసిద్ధత
  • విశాఖలో వసతులు భేష్ అంటూ అమెరికా ప్రతినిధుల కితాబు
  • ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం
భారత్ లో ఇప్పటివరకు అహ్మదాబాద్ కు మాత్రమే పరిమితమైన అమెరికా హబ్ ఇక ఏపీకి కూడా రానుంది. విశాఖలో అమెరికా హబ్ ఏర్పాటు చేసేందుకు అగ్రరాజ్యం ఆసక్తి చూపుతోంది. తెలుగు రాష్ట్రాల యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మన్ ఇవాళ సీఎం జగన్ ను కలిసి తమ ప్రతిపాదనలను వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జోయల్ రీఫ్ మన్, ఇతర అమెరికా అధికారులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాము విశాఖ నగరంలో పర్యటించామని, అక్కడి వసతులు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు.

ఇప్పటివరకు భారత్ లో ఒక్క అహ్మదాబాద్ లోనే తమ హబ్ ఉందని, త్వరలోనే విశాఖలోనూ ఏర్పాటు చేస్తామని సీఎంతో చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నట్టుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా, యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మన్ సానుకూలంగా స్పందించారు.

అమెరికా ముందుకు వస్తే, వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన రాష్ట్రమని, విశాలమైన తీరప్రాంతం అందుకు ఎంతో దోహదపడుతోందని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కోరిన సీఎం జగన్, ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
America Hub
Visakhapatnam
Jagan
Joel Reifman
Andhra Pradesh
USA

More Telugu News