ఏపీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే దారుణ స్థితి దాపురించింది: చినజీయర్ స్వామి
- సరైన దృష్టి లేకపోవడం వల్లే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి
- 17వ తేదీ నుంచి ధ్వంసమైన ఆలయాలను సందర్శిస్తాం
- సహనాన్ని పరీక్షించేందుకు కూడా ఒక హద్దు ఉంటుంది
ఆలయాలపై సరైన దృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చినజీయర్ స్వామి అన్నారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదనే తాను బయటకు వస్తున్నానని చెప్పారు. ఇలాంటి తప్పులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రచారం కోసం కొందరు ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడం సరికాదని అన్నారు.
సహనాన్ని పరీక్షించడానికి కూడా ఒక హద్దు ఉంటుందని చినజీయర్ చెప్పారు. మత పరమైన విషయాలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. ప్రజలకు భరోసా కలిగించేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని చెప్పారు. ఆలయం, మసీదు, చర్చి ఏదైనా సరే... వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.