Donald Trump: అన్నంత పనీ చేసిన ట్రంప్.. వార్షిక రక్షణ విధాన బిల్లు తిరస్కరణ!

Donald Trump vetoes Annual Defense Bill says it a Gift to Russia and China
  • జాతీయ భద్రతకు సంబంధించిన కీలకాంశాలను పట్టించుకోలేదని మండిపాటు
  • రష్యా, చైనాలకు బిల్లు మంచి కానుకలా ఉందని వ్యాఖ్య
  • మిలటరీ చరిత్రను దెబ్బతీసేలా బిల్లులోని నిబంధనలున్నాయన్న ట్రంప్  
  • ట్రంప్ నిర్ణయాన్ని ఓవర్ రైడ్ చేసేందుకు వచ్చే సోమవారం కాంగ్రెస్ సమావేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. కాంగ్రెస్ పాస్ చేసిన వార్షిక రక్షణ విధాన బిల్లును ఆయన రద్దు చేస్తూ గురువారం తీర్మానం చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలకాంశాలను బిల్లులో పట్టించుకోలేదని, అది రష్యా, చైనాలకు పెద్ద బహుమతిలా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ నెల ప్రారంభంలో 2021 ఆర్థిక సంవత్సరానికిగానూ జాతీయ రక్షణ అధీకృత చట్టాన్ని (ఎన్డీఏఏ) కాంగ్రెస్ పాస్ చేసింది. అయితే, థర్డ్ పార్టీ పోస్టులు, కంటెంట్ పై నిఘా పెట్టేలా సామాజిక మాధ్యమాలకు రక్షణ కల్పిస్తున్న 1996 నాటి చట్టంలోని సెక్షన్లను చట్టంలో నుంచి తీసేయలేదని మండిపడిన ట్రంప్.. ఆ బిల్లును పాస్ చేస్తే కచ్చితంగా రద్దు చేస్తానంటూ అప్పుడే హెచ్చరించారు. అన్నట్టుగానే చేశారు. కాగా, ట్రంప్ తన పదవీ కాలంలో ఒకసారి పాసైన బిల్లును రద్దు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

జాతీయ భద్రతకు ఈ చట్టం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తోందో తమ ప్రభుత్వం గుర్తించిందని, దేశానికి రక్షణ కల్పించే ఎలాంటి అంశాలు అందులో లేవని కాంగ్రెస్ కు సందేశం ఇచ్చిన ఆయన.. అలాంటి చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గొప్ప గొప్ప సైనికాధికారులు (ఆర్మీ వెటరన్స్), మిలటరీ చరిత్రను దెబ్బతీసేలా చట్టంలోని నియమాలున్నాయని, జాతి భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విరుద్ధంగా చట్టం ఉందని ఆయన అన్నారు. అమెరికా సమాఖ్య ప్రభుత్వం ఆర్మీ బేస్ లకు పెట్టిన పేర్లను మార్చాలనుకోవడం రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆయన విమర్శించారు. మన దేశ ప్రాథమిక సూత్రాల కోసం ఇన్నాళ్లూ పోరాడి సాధించిన వృద్ధిని వెనక్కుతోసేలా, అవమానించేలా చట్ట నిబంధనలున్నాయన్నారు.
 
కాగా, ట్రంప్ తీర్మానాన్ని కాంగ్రెస్ ఓవర్ రైడ్ చేయాలంటే (అధ్యక్షుని సంతకం అవసరం లేకుండానే చట్టంగా చేయడం) సెనేట్, ప్రతినిధుల సభలో మూడింట రెండొంతుల సభ్యుల ఓట్లు కావాలి. బిల్లు రద్దు కాకుండా ఉండాలంటే 117వ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసే జనవరి 3 మధ్యాహ్నానికి ముందే ట్రంప్ నిర్ణయాన్ని ఓవర్ రైడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మళ్లీ కొత్త బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే క్రిస్మస్ తర్వాత సోమవారం సభను సమావేశపరిచి తీర్మానాన్ని ఓవర్ రైడ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Donald Trump
Defense
Veto
Russia
China
America

More Telugu News