Astrazenica: వ్యాక్సిన్ ట్రయల్స్ ను మరోసారి నిర్వహించాలని ఆస్ట్రాజెనికా తాజా నిర్ణయం!

AstraZeneca To Run Fresh Global Vaccine Trial
  • పనితీరును మరింత లోతుగా పరిశీలించాల్సి వుంది
  • అన్ని దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తాం
  • ఆస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్
తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పనితీరును మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా మరోమారు ట్రయల్స్ నిర్వహించాలని ఆస్ట్రాజెనికా పీఎల్సీ నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియట్ స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్ ఫలితాల నివేదిక విడుదలైన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం వ్యాక్సిన్ పై జరుగుతున్న అధ్యయనంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయని, అందువల్లే మరోమారు ట్రయల్స్ కు వెళుతున్నామని ఆయన అన్నారు.

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో అధిక రోగ నిరోధక శక్తి పెరిగినట్టు రిపోర్టులు రాగా, దీని ఆధారంగానే వ్యాక్సిన్ ను మరింత లోతుగా విశ్లేషించనున్నామని పాస్కల్ వెల్లడించారు. అయితే, తాజా ట్రయల్స్ చాలా త్వరితగతినే పూర్తవుతాయని, చాలా దేశాల్లో ఇది జరుగుతుందని వ్యాక్సిన్ పనితీరుపై అంతర్జాతీయ అధ్యయనం తరువాత దీన్ని విడుదల చేస్తామని తెలిపారు.

అదనపు ట్రయల్స్ కు నియంత్రణా సంస్థల నుంచి మరోమారు అనుమతి కోరాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన, యూకే, యూరప్ తో పాటు మరిన్ని దేశాల్లో ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. కొన్ని దేశాల్లో ట్రయల్స్ కు అనుమతులు ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికాలో టీకాకు ఎఫ్డీయే నుంచి అంత త్వరగా అనుమతులు రావని, మరో దేశంలో జరిగిన ట్రయల్స్ ఆధారంగా అమెరికా నిర్ణయం తీసుకోబోదని ఆయన గుర్తు చేశారు.
Astrazenica
Vaccien
Trails

More Telugu News