మా వ్యాక్సిన్ ను తీసుకోండి: ఇండియాకు జిన్ పింగ్ ఆఫర్
- అభివృద్ధి చెందుతున్న దేశాలతో డీల్స్
- సాధ్యమైనంత త్వరగా ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు
- కరోనాపై త్వరగా విజయం సాధించాలన్న జిన్ పింగ్
తాజాగా, వ్యాక్సిన్ ను పంచుకునే విషయమై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్, కరోనా విషయమై సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకునేందుకు ఇండియా, చైనాలు చర్చలు జరుపుతాయనే భావిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చౌక ధరకు అందించేందుకు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో చైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందని, కరోనాపై పోరాటంలో వివిధ దేశాలకు తాము సహకరిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా కరోనాను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
కాగా, 12వ బ్రిక్స్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన జిన్ పింగ్, చైనా కంపెనీలు రష్యా, బ్రెజిల్ భాగస్వామ్య సంస్థలతో వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పై చర్చిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ విషయంలో ఇండియా, సౌతాఫ్రికాలు తమకు కీలక భాగస్వాములని కూడా అన్నారు. ఈ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాలు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.