Sobha: సీఎం కేసీఆర్ అర్ధాంగి పెద్దమనసు... ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి చేయూత

CM KCR wife Sobha helps a family
  • భారీవర్షాలకు కరీంనగర్ లో వ్యక్తి మృతి
  • దిక్కుతోచని స్థితిలో కుటుంబం
  • చలించిపోయిన సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ
తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ తన పెద్దమనసు చాటుకున్నారు. ఇంటిపెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ కుటుంబానికి చేయూతనందించారు. ఇటీవల భారీ వర్షాలు కురవగా, కరీంనగర్ జిల్లా తిరుమలాపూర్ గ్రామంలో తిరుపతి అనే వ్యక్తి ఇల్లు కూలిపోయి మరణించాడు. దాంతో అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భర్తను కోల్పోయి, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో తిరుపతి భార్య తన ఇద్దరు పిల్లలను, అత్తమామలతో కలిసి ప్రస్తుతం మున్నూరు కాపు భవన్ లో తలదాచుకుంటోంది.

ఈ విషయం తెలిసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ చలించిపోయారు. తిరుపతి కుటుంబానికి ఆర్థికసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తనవంతుగా లక్ష రూపాయలు ప్రకటించారు. ఆ సాయాన్ని చొప్పదండి శాసనసభ్యుడు రవిశంకర్ ద్వారా బాధితులకు అందించారు. అటు, ఇతరులు కూడా ఆర్థికసాయం చేయగా మొత్తం మూడు లక్షల రూపాయలు అయ్యాయి. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే రవిశంకర్.... తిరుపతి కుటుంబసభ్యులకు అందించారు. వారికి ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూం ఇల్లు, పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Sobha
KCR
Help
Family
Karimnagar District

More Telugu News