Laknepally: పర్యాటక కేంద్రంగా పీవీ నరసింహారావు జన్మస్థలం లక్నేపల్లి

PV Narasimharao birthplace Laknepally to be developed as a tourism spot
  • లక్నేపల్లి గ్రామాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రులు
  • గ్రామస్తులతో సమావేశం
  • పీవీ శతజయంతి వేడుకలకు భారీగా కేటాయింపులు చేసిన ప్రభుత్వం
బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీ జన్మస్థలం వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామాన్ని పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో లక్నేపల్లి గ్రామాన్ని రాష్ట్ర టూరిజం శాఖ మంతి వి.శ్రీనివాస్ గౌడ్, ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులు సందర్శించారు. లక్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పీవీ స్మారక మందిరాన్ని పరిశీలించారు. గ్రామాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయనున్న విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. ఈ మేరకు ఓ సమావేశం నిర్వహించారు.

ఇటీవల పీవీ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు. పీవీ జన్మస్థలం లక్నేపల్లితో పాటు ఆయన పెరిగిన వంగర గ్రామాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆదేశించారు. దాంతో మంత్రి ఇవాళ లక్నేపల్లి వచ్చారు. కాగా, తెలంగాణ టూరిజం సర్క్యూట్ లో లక్నేపల్లిని కూడా చేర్చేందుకు వచ్చిన ప్రతిపాదనను రాష్ట్ర పర్యాటక విభాగం పరిశీలిస్తోంది.
Laknepally
Tourism Spot
PV Narasimharao
Telangana

More Telugu News