Galla Aruna Kumari: రాజశేఖరన్నా... మీ హెలికాప్టర్ కోసం ఎదురుచూసిన క్షణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతున్నాయి: గల్లా అరుణ

Galla Aruna Kumari remembers death of YS Rajasekhar Reddy
  • నేడు వైఎస్ వర్ధంతి
  • గల్లా అరుణకుమారి భావోద్వేగభరిత సందేశం
  • వైఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్న గల్లా అరుణకుమారి

కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న టీడీపీ నేత గల్లా అరుణకుమారి సోషల్ మీడియాలో ఆసక్తికర సందేశం వెలువరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆమె తన ఆత్మీయ అనుబంధాన్ని భావోద్వేగభరితంగా వివరించారు. ఇవాళ వైఎస్ వర్ధంతి సందర్బంగా ఆమె స్పందించారు. రాజశేఖరన్నా... అన్నగా మీరు అందించిన స్ఫూర్తి, రాజకీయంగా, పారిశ్రామికంగా మీరు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

కొన్నేళ్ల కిందట ఇదే రోజు మీరు ప్రయాణించే హెలికాప్టర్ కోసం చిత్తూరులో ఎదురుచూసిన క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందే కదలాడుతున్నాయి అంటూ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "మీ మరణం తర్వాత నా రాజకీయ జీవితం అనుకోని మలుపు తిరిగినా, మీరు నాపై చూపించిన ఆప్యాయత, అనురాగాలను.. అందించిన సహకారాన్ని ఎల్లప్పుడు స్మరించుకుంటాం. అలాంటి మీరు మా మధ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ రోజు మీ వర్ధంతి సందర్భంగా మీ ఆత్మకు శాంతి కలగాలని, పైనుంచి మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ... మీ చెల్లెమ్మ గల్లా అరుణకుమారి" అంటూ తన సందేశం వెలువరించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గల్లా అరుణకుమారి నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ కు ప్రమాదం జరిగిన సమయంలో చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు గల్లా అరుణ తదితరులు ముందే విమానంలో వెళ్లారు. ఆ తర్వాత బయల్దేరిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో అత్యంత విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు.


  • Loading...

More Telugu News