New Delhi: కరోనా టీకా ప్రయోగాలలో పాల్గొనేందుకు వచ్చిన 20 శాతం మందిలో ఇప్పటికే యాంటీ బాడీలు!: ఎయిమ్స్ 

Delhi AIIMS Says 20 Percent People Having Corona Anti Bodies
  • ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
  • 80 మందిని పరిశీలించిన వైద్య బృందం
  • పలువురిలో అప్పటికే యాంటీ బాడీలు
కరోనా వ్యాక్సిన్ ను అడ్డుకునేలా తయారైన టీకా ప్రయోగాల నిమిత్తం ముందుకు వచ్చిన వారిలో 20 శాతం మంది శరీరాల్లో ముందే వైరస్ ను తట్టుకునే యాంటీ బాడీలు ఉన్నాయని న్యూఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. దీంతో వారందరినీ వ్యాక్సిన్ ప్రయోగానికి అనర్హులుగా తేల్చామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా ప్రయోగానికి న్యూఢిల్లీ ఎయిమ్స్ కు కూడా అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆపై పేర్లు నమోదు చేసుకోవాలని కోరగా, దాదాపు 80 మంది వరకూ ముందుకు వచ్చారు. వీరిలో కేవలం 16 మందిని మాత్రమే వైద్య బృందం వ్యాక్సిన్ టెస్ట్ కు ఎంపిక చేసింది.

వీరు 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, కిడ్నీ, కాలేయ సమస్యలతో పాటు నియంత్రణలోలేని షుగర్ వ్యాధి ఉన్నవారిని, బీపీతో బాధపడుతున్న వారిని మొదట్లోనే వెనక్కు పంపారు. ఆపై మిగతా వారి రక్త నమూనాలను పరిశీలించగా, 20 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు కనిపించాయి. దీంతో వారిపై టీకాను ప్రయోగించినా కచ్చితమైన ఫలితాలు వెలువడబోవన్న ఆలోచనలో పడ్డ వైద్య బృందం, వారిని తిరస్కరించింది. కాగా, అప్పటికే కరోనా సోకి, నయం కావడంతోనే వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ఉండవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
New Delhi
AIIMS
Corona Virus
Vaccine
Bharat Biotech
Covaxin

More Telugu News