Beirut: బీరూట్ లో రెండో పేలుడు... భీతి గొలుపుతున్న దృశ్యాలు!

Second Blast in Beirut
  • ప్రాధమిక సమాచారం ప్రకారం 73 మంది మృతి
  • 3,700 మందికి గాయాలు
  • తప్పిపోయిన వారికోసం బంధువుల వెతుకులాట
  • దోషులను వదిలిపెట్టబోమన్న లెబనాన్ అధ్యక్షుడు
లెబనాన్ రాజధాని బీరూట్ నౌకాశ్రయం ప్రాంతంలో రెండో పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అధికారులు వెల్లడించిన ప్రాధమిక సమాచారం ప్రకారం, 73 మంది వరకూ మరణించగా, సుమారు 3,700 మందికి గాయాలు అయ్యాయి. రెండో పేలుడుతో, ఆకాశంలో నారింజ రంగులో బంతి ఆకారంలో మంట ఏర్పడిందని, వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయని, పేలుడు శబ్దాలతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వేలాది మంది తమవారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

కాగా పేలుడు శబ్దాలు బీరూట్ కు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవుల వరకూ వినిపించడం గమనార్హం. ఇది ఓ అణుబాంబు తీవ్రతను గుర్తు చేసిందని, నౌకాశ్రయం ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మాక్రోవీ యర్గానియన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలను చూడలేదని ఆయన అన్నారు. 1975 నుంచి 1990 మధ్య పదిహేను సంవత్సరాల పాటు సివిల్ వార్ సాగినా, ఇంతటి పేలుళ్లు జరగలేదని అన్నారు.

ఎన్నో సంవత్సరాల నుంచి దాచివుంచిన వందల టన్నుల కొద్దీ రసాయనాలు ఒక్కసారిగా పేలినట్టు తెలుస్తుండగా, లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ అవోన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు.
Beirut
Blast
Lebanon

More Telugu News