రెండో స్థానంలోకి పరుగులు... ఇండియాలో 15 లక్షలు దాటేసిన కరోనా కేసులు!
- ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్
- ఇండియాలో రోజుకు దాదాపు 50 వేల కేసులు
- ఆగస్టులోనే రెండో స్థానానికి వెళ్లే అవకాశం
ప్రస్తుతం రోజుకు దాదాపు 50 వేలకు పైగా కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియాలో మహమ్మారి ఇంకా వ్యాపిస్తోందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా ప్రపంచాన్ని పట్టిన తరువాత... ఇంకా చెప్పాలంటే, తొలి కేసు ఇండియాలో వచ్చిన తరువాత నాలుగు నెలలకు లక్ష కేసులు రాగా, ఆపై రెండు నెలల వ్యవధిలోనే కేసుల సంఖ్య 15 లక్షలకు చేరడం గమనార్హం.
యూఎస్ లో పరీక్షలు చేస్తున్న నమూనాల్లో 1.7 శాతం పాజిటివ్ రేటు ఉండగా, అది ఇండియాలో ప్రస్తుతం 3.6 శాతంగా ఉంది. బ్రెజిల్ తో పోల్చినా భారత్ లో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండటంతో కేసుల సంఖ్య విషయంలో ఆగస్టులోనే రెండో స్థానానికి ఇండియా చేరుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన స్థానంలో ఉందని నరేంద్ర మోదీ, మూడు రోజుల క్రితం తన 'మన్ కీ బాత్'లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక ఇండియాలో కేసుల సంఖ్య దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రాలు ముందున్నాయి. ఈ రాష్ట్రాల్లో తదుపరి చర్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది.