ఆ రోజు తెల్లవారు జామున నాకు ఫోన్‌ చేసి పారిపొమ్మని చెప్పాడు.. పారిపోయాను: దూబే భార్య రిచా

dubay calls me same day says richa
  • నా భర్త చాలా మంచివాడు
  • మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను
  • ఈ నెల 3న తెల్లవారు జామున ఫోన్ చేశాడు
  • చివరిసారిగా మావారితో మాట్లాడాను
  • లక్నోలోని ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడు 
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల ప్రాణాలు తీసిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనంతరం ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఆయన భార్య రిచా దుబే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త చాలా మంచివాడని చెప్పుకొచ్చింది. పోలీసులు ఆయనను వాడుకుని, ఆ తర్వాత నాశనం చేశారని వాపోయింది.

తనకు రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని చెప్పింది. తన భర్త నేరస్థుడై ఉండొచ్చని, అయినప్పటికీ ఆయనో మంచి భర్త, తండ్రి అని వ్యాఖ్యానించింది. కాన్పూర్‌లో పోలీసులపై కాల్పుల ఘటన అనంతరం దూబే తనకు ఫోన్‌ చేశాడని, ఆయనతో అదే తాను చివరిసారి మాట్లాడడమని చెప్పింది.

ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఇప్పటికే కమిటీ నియమించిన నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. కాగా, తన సోదరుడి పేరు రాజు నిగమ్ అని, ఆయన దూబేకు స్నేహితుడని చెప్పింది. దూబేను తాను తన సోదరుడి సాయంతో 1990లో తొలిసారి కలిశానని చెప్పింది.

తన సోదరుడే తమ పెళ్లి జరిపించాడని తెలిపింది. భార్యాపిల్లలను దూబే అమితంగా ప్రేమిస్తాడని చెప్పింది. తమకు ఖర్చుల కోసం ప్రతి నెల రూ. 40 వేలు పంపించేవాడని వివరించింది. తమ పెద్ద కొడుకు రష్యాలో మెడిసిన్‌ చదువుతున్నాడని, చిన్న కుమారుడు 12వ తరగతిలో 90 శాతం మార్కులతో పాస్ అయ్యాడని చెప్పింది. తల్లిదండ్రులను కూడా దూబే గౌరవించేవాడని తెలిపింది.

ఈ నెల 3న తెల్లవారు జామున 2 గంటల సమయంలో తనకు దూబే నుంచి ఫోన్‌ వచ్చిందని, లక్నోలోని ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడని తెలిపింది. దీంతో తాను వెంటనే తన స్నేహితుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లానని చెప్పింది.
Go Back to Shorts
dubay
Uttar Pradesh

More Telugu News