Covaxin: 'ఓ అంతానికి ఆరంభం'... దేశీయ వ్యాక్సిన్ ట్రయల్స్ పై కేంద్రం కీలక ప్రకటన!

Center Says This is the Bigining of the End on Vaccine Trails
  • స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవాగ్జిన్ జైకోవ్-డీ
  • తయారు చేసిన భారత కంపెనీలు
  • అభినందించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రెండు కరోనా వ్యాక్సిన్ లు కోవాగ్జిన్, జైకోవ్-డీల హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానుండటాన్ని కీలక పరిణామంగా కేంద్రం పేర్కొంది. "ఓ అంతానికి ఆరంభం" అని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.12 కోట్ల మంది ప్రజలు వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా కంపెనీలు కృషి చేస్తుండగా, హ్యూమన్ ట్రయల్స్ స్థాయికి 11 మాత్రమే వెళ్లాయి.

"డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన అనుమతుల తరువాత, వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యాయి" అని  కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. కరోనా తయారీ కోసం ఆరు భారత కంపెనీలు కృషి చేస్తున్నాయని, అందులో రెండు తుది అడుగుల దిశగా సాగుతున్నాయని గుర్తు చేసింది.

బ్రిటీష్ సంస్థ ఆస్ట్రాజెనికా, యూఎస్ సంస్థ మెడెర్నాలు తయారు చేసిన వ్యాక్సిన్ లు ఏజడ్డీ 1222, ఎంఆర్ఎన్ఏ 1273ల కోసం ఇప్పటికే భారత కంపెనీలతో తమ వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ లు మానవులకు సురక్షితమని, ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలాల్సి వుందని పేర్కొంది. ఈ రెండు వ్యాక్సిన్ లూ ప్రస్తుతం ఫేజ్ 2, ఫేజ్ 3 దశల్లో ఉన్నాయి.

కాగా, వ్యాక్సిన్ ట్రయిల్స్ లో తొలి రెండు దశలూ ఏ మోతాదులో వ్యాక్సిన్ ఇవ్వాలన్న విషయాన్ని, మూడో దశలో ఇది ఎంత మేరకు పనిచేస్తుందన్న విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఇది తేలేందుకు నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ట్రయల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇటీవల ఐసీఎంఆర్ ఓ ప్రకటన చేస్తూ, ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించి, విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
Covaxin
Jaicov-d
Vaccine
India

More Telugu News