Fire: చైనా సైనికుల టెంట్లలో మిస్టరీ మంటలు... ఇవే ఘర్షణకు దారితీశాయన్న కేంద్ర మంత్రి

Unknown fire in a China tent causes massive clashes at Galwan Valley
  • గాల్వన్ లోయ వద్ద చైనా గుడారాలు
  • తొలగించాలని కోరిన భారత సైనికులు
  • ఓ గుడారం తొలగిస్తుండగా మంటలు
  • ఆపై ఇరుపక్షాలు ఘర్షణకు దిగాయన్న వీకే సింగ్
చైనా సైనికులతో గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో 21 మంది భారత సైనికులు మరణించడం యావత్ జాతిని విషాదానికి గురిచేసింది. ఈ ఘటనకు చైనా సైనికుల దురుసు ప్రవర్తనే కారణమని తెలిసినా, అందుకు దారితీసిన పరిస్థితులపై ఇప్పటికీ స్పష్టతలేదు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఈ ఘటనలో కొత్త కోణం వివరించారు.

జూన్ 15 నాటి భీకర ఘర్షణలకు చైనా గుడారాల్లో ఉన్నట్టుండి చెలరేగిన మిస్టరీ మంటలే కారణమని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల సైనికులు ఉండరాదని మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చల్లో అంగీకరించారని, అందుకే ఎల్ఏసీ వద్ద పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడానికి భారత సైనికుల బృందం గాల్వన్ లోయ వద్దకు వెళ్లిందని వీకే సింగ్ వివరించారు. చైనా సైనికులు అక్కడే ఉన్నట్టు మనవాళ్లు గుర్తించారని, చైనా సైనికులు కొన్ని టెంట్లు కూడా వేసినట్టు తెలుసుకున్నారని వెల్లడించారు.

ఆ గుడారాలు తొలగించాలని చైనా సైనికులను మన సైనికులు హెచ్చరించగా, వారు ఓ గుడారాన్ని తొలగిస్తున్నంతలో హఠాత్తుగా మంటలు రేగాయని చెప్పారు. దాంతో ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో చైనా సైనికులు 40 మందికి పైగా చనిపోయారని వెల్లడించారు. అయితే, ఆ మంటలకు కారణం ఏంటో వీకే సింగ్ కూడా చెప్పలేకపోయారు. వీకే సింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా వ్యవహరించారు.
Fire
Tent
China
India
Galwan Valley
VK Singh

More Telugu News