Syed Ali Shah Geelani: కశ్మీర్ లో కీలక పరిణామం.. హురియత్ కు గుడ్ బై చెప్పిన వేర్పాటువాది గిలానీ

Separatist Syed Ali Shah Geelani Quits Hurriyat Conference
  • మూడు దశాబ్దాలుగా వేర్పాటువాదాన్ని నడిపించిన గిలానీ
  • హురియత్ లో క్రమశిక్షణ లోపించిందని వ్యాఖ్య
  • నాయకత్వంపైనే కుట్రలు చేశారని మండిపాటు
జమ్మూ కశ్మీర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా వేర్పాటువాద రాజకీయాలు చేస్తూ వస్తున్న సయ్యద్ అలీ షా గిలానీ హురియత్ కాన్ఫరెన్సుకు గుడ్ బై చెప్పారు. 1990ల నుంచి కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమాన్ని ఆయన నడిపించారు. హురియత్ కు ఆయన జీవితకాల చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 90 ఏళ్ల గిలానీ ఇప్పుడు హురియత్ ను వీడటం కశ్మీర్ లోయతో పాటు, పాకిస్థాన్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే హురియత్ కు తాను రాజీనామా చేస్తున్నానని ఓ ఆడియో మెసేజ్ ద్వారా గిలానీ తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలన్నింటినీ హురియత్ కు పంపిన రాజీనామా లేఖలో వివరంగా పేర్కొన్నానని చెప్పారు.

తాను చేసిన పోరాటాలు, ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని ఆయన చెప్పారు. హురియత్ లో నిధుల దుర్వినియోగంతో పాటు పలు అవకతవకలు జరిగాయని... వీటన్నింటికీ సమాధానాన్ని మీరు చెప్పాల్సి ఉందని లేఖలో ఆయన అన్నారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారని, కుట్రలు పన్నారని ఆరోపించారు. హురియత్ లో క్రమశిక్షణ కొరవడిందని విమర్శించారు. రెబల్ గ్రూపులతో చేయి కలిపి, హురియత్ నాయకత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని మండిపడ్డారు.

మరోవైపు, గిలానీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారంటూ పాకిస్థాన్ కు చెందిన కొన్ని గ్రూపులు ఆయనను టార్గెట్ చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో చోటుచేసుకున్న కీలక పరిణామం ఇదే కావడం గమనార్హం.
Syed Ali Shah Geelani
Hurriyat Conference
Jammu And Kashmir

More Telugu News