Ghost Villages: వలస కార్మికులకు క్వారంటైన్ కోసం వినూత్నంగా ఆలోచించిన ఉత్తరాఖండ్!
- ఉత్తరాఖండ్ లో దెయ్యాల గ్రామాలు
- సరైన వసతుల్లేని కారణంగా గ్రామాలను ఖాళీ చేసిన ప్రజలు
- ఇప్పుడా గ్రామాల్లో వలస జీవులకు క్వారంటైన్
మూడో విడత లాక్ డౌన్ లో కొన్ని సడలింపుల కారణంగా వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లే వీలు చిక్కింది. అయితే, పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వస్తుండడంతో ఆయా రాష్ట్రాలు కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేల సంఖ్యలో కార్మికులు వస్తుండడంతో వారికి ఎక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వాలకు ఓ సమస్యగా మారింది. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం మాత్రం ఆ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొంది.
రాష్ట్రంలో కొన్నిచోట్ల ప్రజలు ఖాళీ చేసిన గ్రామాలను వలస కార్మికులకు క్వారంటైన్లుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఉత్తరాఖండ్ లో సరైన వసతులు లేని గ్రామాలను ప్రజలు ఖాళీ చేయగా, ఇప్పుడక్కడెవరూ నివాసం ఉండడంలేదు. దాంతో పాడుబడిన ఆ గ్రామాలను దెయ్యాల గ్రామాలుగా పిలుస్తుంటారు. ఇప్పుడా దెయ్యాల గ్రామాలే ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆశాదీపాల్లా కనిపిస్తున్నాయి.
సాధారణ గ్రామాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే వైరస్ వ్యాపించే ముప్పు ఉన్న దృష్ట్యా, ఈ దెయ్యాల గ్రామాల్లో అయితే ఎవరికీ సమస్య ఉండదని ఉత్తరాఖండ్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని పావురీ జిల్లాలో ఇలాంటి దెయ్యాల గ్రామాలు 186 వరకు ఉన్నాయట. ఇప్పుడు వాటిలో చాలా గ్రామాల్లో సదుపాయాలు కల్పించారు. ఇళ్లను శుభ్రం చేయించి క్వారంటైన్ కోసం వచ్చే వలస కార్మికులకు అనువుగా తీర్చిదిద్దారు.