'కేజీఎఫ్'ను ప్రసారం చేసిన తెలుగు లోకల్ చానెల్... నిర్మాతల ఆగ్రహం!

KGF Producer angry on Telugu Channel
  • శాండల్ వుడ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించిన 'కేజీఎఫ్' 
  • లోకల్ చానెళ్లలో ప్రసారం చేస్తున్నారని నిర్మాత ఆరోపణ
  • ఇప్పటికే చాలా సార్లు వేశారని నెటిజన్ల కామెంట్
శాండల్ వుడ్ సినీ పరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించిన 'కేజీఎఫ్' చిత్రాన్ని ఓ తెలుగు స్థానిక చానల్, ప్రసారం చేయడంపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరు చానెల్ లో సినిమా ప్రసారమవుతున్న సమయంలో తీసిన వీడియోలను, స్క్రీన్ షాట్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని వెల్లడించారు.

సినిమా శాటిలైట్ హక్కుల విక్రయం తుది దశకు చేరిందని, ఈ సమయంలో కేబుల్ చానెల్ సినిమాను ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని, వారికి సమన్లు జారీ చేయిస్తామని తెలిపారు. ఇక కార్తీక్ గౌడ ట్వీట్ ను చూసిన వారంతా, ఈ సినిమాను లోకల్ చానెళ్లలో పలుమార్లు ప్రసారం చేశారని కామెంట్ చేస్తుండగా, అన్ని చానెళ్లపైనా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేయనున్నామని సమాధానం ఇచ్చారు.

కాగా, యశ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. రెండో భాగంలో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు.
Go Back to Shorts
KGF
Sandelwood
Producer
Local Channel
Case

More Telugu News