లాక్డౌన్ ను ఉల్లంఘించి పెళ్లి.. వధూవరుల అరెస్ట్
- పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా అతిథులు
- దక్షిణాఫ్రికాలో ఘటన.. ఫొటోలు వైరల్
- ఆ దేశంలో 1700 మందికి కరోనా పాజిటివ్
స్థానిక వార్తా సంస్థ కథనం ప్రకారం.. 48 ఏళ్ల జబులాని జులు అనే వ్యక్తి నొమ్తాండాజొ మెక్ జీ (38)ని ఆదివారం వివాహం చేసుకున్నాడు. క్వాజులు- నటాల్ అనే ప్రాంతంలో ఈ పెళ్లి జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై అక్కడ నిషేధం ఉంది. అయినా.. జులు, మెక్ జీ పెళ్లి వేడుక జరుగుతున్న విషయం తెలియడంతో ఆయుధాలు ధరించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వేడుకను నిలిపివేసి వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన యాభై మందికి పైగా కుటుంబ సభ్యులు, అతిథులను అరెస్ట్ చేశారు. అందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి.. ఒక్కొక్కరికి రూ. 4100 పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. కాగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటిదాకా 1700 పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఈనెల 16 వ తేదీ వరకూ లాక్డౌన్ అమల్లో ఉండనుంది.