India: శభాష్ ఇండియా.. మీ నిర్ణయం సాహసోపేతం: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక రాయబారి

Lockdown in India was early and courageous says WHO envoy

  • కరోనా తొలి దశలోనే లాక్ డౌన్ విధించారు
  • మహమ్మారి విస్తరించిన తర్వాత కట్టడి చేయడం కష్టం
  • అమెరికా, యూరోపియన్ దేశాలు సరైన సమయంలో చర్యలు తీసుకోలేకపోయాయి

కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రత్యేక రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో తెలిపారు. భవిష్యత్తు కోసం కఠినమైన నిబంధనలను ప్రజలు అనుసరించాలని చెప్పారు. కరోనా కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే భారత్ అప్రమత్తమైందని... లాక్ డౌన్ విధించి మహమ్మారి కట్టడికి కృషి చేసిందని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

మహమ్మారి విస్తరించకముందే మనం మేల్కోవాలని... లేకపోతే అది మరింత పెద్ద సమస్యగా మారుతుందని డేవిడ్ చెప్పారు. కరోనా భారీగా విస్తరించిన తర్వాత దాన్ని కట్టడి చేయడం చాలా కష్టమైన పని అని అన్నారు. తక్కువ కేసులు నమోదైన దశలోనే ప్రభుత్వ సూచనల మేరకు క్షేత్ర స్థాయి నుంచి కరోనా కట్టడి కోసం పోరాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు.

ఏదైనా సరే కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని... కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించడం, ఐసోలేషన్ లో పెట్టడం, అతని కాంటాక్టులను గుర్తించడం, క్వారంటైన్ కు తరలించడం, చికిత్స అందించడం వంటివి క్రమ పద్ధతిలో జరగాలని డేవిడ్ తెలిపారు. లాక్ డౌన్ల ద్వారా మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెప్పారు. లాక్ డౌన్ ద్వారా కరోనా కట్టడి అవుతున్న విషయాన్ని తాను ఇండియాలో గుర్తించానని అన్నారు.

దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన వెంటనే భారత్ మేల్కొందని... మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే అవకాశాన్ని దేశ ప్రజలకు కల్పించిందని... ఇది ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమని డేవిడ్ కితాబిచ్చారు. దీంతో క్షేత్ర స్థాయిలో కూడా మహమ్మారిని కట్టడి చేసే సమయం దొరికిందని చెప్పారు.

అయితే, లాక్ డౌన్ వల్ల రోజువారీ జీవితాలకు అంతరాయం కలుగుతోందనే ఆగ్రహాలు కూడా కొన్ని చోట్ల కనపడుతున్నాయని... ఇది ఆవేదన కలిగించే అంశమని అన్నారు. పేద ప్రజల రోజువారీ వేతనాలపై లాక్ డౌన్ ప్రభావం ఉంటుందని... అయినా వారు మహమ్మారిని కట్టడి చేసేందుకు త్యాగాలకు పాల్పడుతున్నారని కొనియాడారు. మూడు, నాలుగు వారాల తర్వాత పరిస్థితి చేజారిన తర్వాత లాక్ డౌన్ విధించకుండా... తొలి రోజుల్లోనే ఆ పని చేయడం భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్య అని ప్రశంసించారు.

కరోనా కట్టడి కోసం వివిధ దేశాలు తీసుకున్న చర్యలను పోల్చి చూడటం అనవసరమని డేవిడ్ చెప్పారు. అయితే సరైన సమయంలో అమెరికా, యూరోపియన్ దేశాలు సరైన చర్యలను తీసుకోలేకపోయాయని అన్నారు. ఆ దేశాలు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నాయని చెప్పారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ ను ఎన్ని రోజులు అమలు చేయాలనేది... దాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని  డేవిడ్ చెప్పారు. లాక్ డౌన్ కు ప్రజల సంఘీభావం ఉంటేనే అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని అన్నారు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉండాలనే దానిపై తాను ఏమీ చెప్పలేనని అన్నారు. భారత్ విషయానికి వస్తే లాక్ డౌన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోందని... లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితి మళ్లీ చేజారకుండా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భారత ప్రభుత్వ వ్యూహం పక్కాగా ఉందని కితాబిచ్చారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని డేవిడ్ చెప్పారు. ముఖ్యంగా అందరికీ ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. దాదాపు 70 దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోందని చెప్పారు. కరోనా వైరస్ అంతరించిపోతుందా? లేక సీజనల్ జబ్బుగా అవతరిస్తుందా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.

ఇంతకీ ఈ వైరస్ వయసు కేవలం 4 నెలలు మాత్రమేనని... ఈ  మహమ్మారిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ ఎలా వ్యవహరిస్తుందో తనకు తెలియదని అన్నారు. ఇండియాలో వేసవి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ వైరస్ అదే వేగంతో విస్తరిస్తుందా? లేక నెమ్మదిస్తుందా? అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని... దీని గురించి తెలుసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News