Andhra Pradesh: ఏపీలో 87 మందికి కరోనా.. అందులో 70 మంది ఢిల్లీ వెళ్లొచ్చినవారే: సీఎం జగన్

87 corona cases in AP and 70 of them who attended Delhi says CM Jagan
  • రాష్ట్రం నుంచి ఢిల్లీకి 1085 మంది
  • వారిలో 575 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం
  • మరో 21 మంది జాడ గుర్తించాల్సి ఉందన్న సీఎం
  • వైరస్ లక్షణాలు ఉంటే 104కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వారిలో 70 మంది ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని చెప్పారు. రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది ఈ సదస్సుకు హాజరయ్యారన్నారు.

అందులో 585 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 70 కేసులు పాజిటివ్‌గా వచ్చాయని చెప్పారు. మరో 500 కేసుల ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఇంకో 21 మంది జాడ గుర్తించాల్సి ఉందని సీఎం చెప్పారు. అందువల్ల ఢిల్లీకి వెళ్లివచ్చిన వారు, వారితో ప్రయాణించిన వారు, వాళ్లను కాంటాక్ట్ అయిన వాళ్లు వెంటనే 104కు ఫోన్‌ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారందరినీ గుర్తించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పారు.

ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నాం 

రాష్ట్రంలో ఎవరికి బాగాలేకపోయినా వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సీఎం సూచించారు. గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బందితో ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య సమస్య ఉంటే వారి దృష్టికి తేవాలన్నారు. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా, మందులు కూడా ఇస్తారని చెప్పారు. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్తారని తెలిపారు.

జ్వరం, గొంతునొప్పి, దగ్గు ఉంటే వెంటనే 104కు ఫోన్ చేసి చెప్పాలని ప్రజలకు సూచించారు. వెంటనే చికిత్స చేయించుకొని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం వద్దన్నారు. దానివల్ల కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైనట్టు రిపోర్టులు ఉన్నాయని, అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు సేవలు అందించాలి

ఈ సంక్షోభ సమయంలో సేవలు అందించాలని ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులను సీఎం జగన్‌ కోరారు. కరోనా నివారణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు ప్రైవేట్ ఆసుపత్రుల సహాయాన్ని కోరాయని చెప్పారు.
Andhra Pradesh
Corona Virus
87 positive
70 from delhi returnsns

More Telugu News