Sonia Gandhi: ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Congress chief Sonia Gandhi writes to PM Modi over corona measures
  • లాక్ డౌన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తోందన్న సోనియా
  • కేంద్రానికి మద్దతుగా నిలుస్తామని వెల్లడి
  • వైద్య సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
  • పేదలకు నగదు అందించాలని సూచన
కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 21 రోజుల లాక్ డౌన్ కాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రూపం దాల్చి ప్రపంచాన్ని తుడిచిపెట్టేంత స్థాయిలో విజృంభిస్తోందని, ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

అయితే, కరోనాపై పోరాటంలో కీలకంగా నిలుస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి  ఎన్-95 మాస్కులు, హజ్మట్ సూట్లు వంటి రక్షణ కల్పించే వస్తు సామగ్రిని తక్షణమే అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య సిబ్బంది రక్షణకు పూర్తి భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనేక అభివృద్ధి చెందిన దేశాలు సైతం వెల్లువలా వస్తున్న కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయని, భారత్ లో అలాంటి పరిస్థితి రాకుండా తగినన్ని ఆసుపత్రులు, బెడ్లు, వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రం తక్షణమే రంగంలోకి దిగి ఐసీయూలు, వెంటిలేటర్లు పెద్ద సంఖ్యలో కలిగివుండే తాత్కాలిక వైద్య శిబిరాలను నిర్మించాలని సోనియా తన లేఖలో తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతుల నుంచి రుణచెల్లింపులను ఓ ఆరు నెలల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల లాక్ డౌన్ కాలంలో ప్రజలకు చేయూతనిచ్చే క్రమంలో ప్రతి జన్ ధన్ ఖాతాదారుకు, ప్రతి పీఎం కిసాన్ యోజన్ ఖాతాదారుకు, వృద్ధాప్య, వితంతు పెన్షన్ దారులకు, ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రతి ఒక్కరికీ రూ.7,500 చొప్పున ఖాతాలో వేయాలని సూచించారు. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో కార్డుదారుడికి 10 కిలోల బియ్యం లేక 10 కిలోల గోధుమలు ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు.
Sonia Gandhi
Narendra Modi
Letter
Corona Virus
India
Lockdown

More Telugu News