ఢిల్లీ అల్లర్లపై పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీ!
- అర్ధరాత్రి పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ మురళీధర్
- అల్లర్ల సందర్భంగా పోలీసుల తీరును తప్పుపట్టిన వైనం
- తీర్పు వెలువరించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బదిలీ
ఆయనను పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తక్షణం సంతకం చేయడం, ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది.
మురళీధర్ బదిలీ వ్యవహారంపై కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి ఈనెల 12వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం ఆయన బదిలీకి ప్రతిపాదించగా, దీన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ అప్పటి నుంచి ఆందోళన చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్లను మురళీధర్ అర్ధరాత్రి తన ఇంట్లోనే విచారించి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒక వర్గాన్ని సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడాన్ని అడ్డుకోవద్దంటూ పోలీసులను హెచ్చరిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించారు. ఈ విచారణ జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మురళీదర్‌పై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది.