bombay highcourt: తాత, నానమ్మలను కలవకుండా పిల్లల్ని ఆపడం సరికాదు.. మహిళకు బాంబే హైకోర్టు ఆదేశం

Not right to deprive childs access to grandparents Bombay HC Order
  • భర్త చనిపోవడంతో దూరంగా ఉంటున్న మహిళకు ఆదేశం
  • తనను సరిగా చూసుకోలేదన్న కారణంతో చూడనివ్వనని చెప్పలేరు
  • వారానికోసారి కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ తీర్పు
తాత, నానమ్మలను కలవకుండా పిల్లలను ఆపడం సరికాదని.. తాత, నానమ్మలను కలిసేందుకు పిల్లలకు, పిల్లలను కలిసేందుకు వారికి హక్కు ఉంటుందని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. భర్త చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని వదిలేసి, మరో వివాహం చేసుకుని వెళ్లిపోయిన మహిళ వేసిన పిటిషన్ విషయంలో కోర్టు ఈ తీర్పు నిచ్చింది. భర్త తల్లిదండ్రులు వారానికోసారి తమ మనవడిని చూసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

ఏం జరిగింది?

ముంబైకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త, అత్తామామలతో కలిసి ఆమె ఢిల్లీలో ఉండేది. వారికి 2009లో ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఆమె భర్త 2010లో చనిపోయాడు. తర్వాత ఆమె ఆ కుటుంబాన్ని వదిలేసి, కుమారుడిని తీసుకుని ముంబైలో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అప్పటినుంచీ అత్తామామలను దగ్గరికి రానీయ్యలేదు. మనవడిని చూడనివ్వలేదు. అదే సమయంలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మనవడిని చూసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ అత్తామామలు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. మనవడిని చూసుకునేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు నిచ్చింది.

అయినా చూడనివ్వకపోతే..

ఫ్యామిలీ కోర్టు తీర్పును ఆమె పట్టించుకోలేదు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. పెళ్లయ్యాక అత్తామామలు తనను సరిగా చూసుకోలేదని, చాలా ఇబ్బందులు పెట్టారని ఆరోపించింది. తన కుమారుడు తాత, నానమ్మను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని, అందువల్ల ఇక ముందు చూసేందుకు అవకాశం ఇవ్వొద్దని కోర్టును కోరింది. కానీ ఈ వాదనలను కోర్టు తప్పుపట్టింది.

మనవడిని చూడనివ్వాల్సిందే..

పెళ్లయ్యాక అత్తామామలు సరిగా చూసుకోలేదన్న కారణంతో వారు మనవడిని కలవకుండా ఆపడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వారు మనవడిని చూడలేకపోవడానికి తల్లిగా మీరే కారణమని స్పష్టం చేసింది. మనవడిని వారానికోసారి చూసుకోవడానికి తాత, నానమ్మలకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. వారానికోసారి వారు రాలేకపోతే.. వారు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు కలవనివ్వాలని ఆదేశించింది.
bombay highcourt
High Court
High Court Order
grand parents
grand children

More Telugu News