Supreme Court: నేర చరిత్ర ఉన్న నాయకులపై ఉక్కుపాదం.. రాజకీయ పార్టీలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Supreme court directs political parties Candidates Criminal History should be uploaded On webSites
  • అభ్యర్థుల నేర చరిత్రను వెబ్ సైట్లలో ఉంచండి
  • టికెట్లు ఇచ్చిన 48 గంటల్లో అభ్యర్థుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
  • గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదు
ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయనేది దేశంలోని ప్రజలందరికీ ఉన్న ఒక బలమైన అభిప్రాయమనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా దాదాపు అన్ని పార్టీల నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్నికల అఫిడవిట్లలో ఎంతో మంది నేతలు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఓటర్లకు కూడా మరోదారి లేక వీరిలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. నేర చరిత్ర ఉన్నవారిపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని... వార్తాపత్రికల్లో కూడా ప్రచురించాలని ఆదేశించింది. 72 గంటల్లోపల అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి అందించాలని చెప్పింది.

ఎన్నికలలో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనే ప్రక్రియ కేవలం ఆ వ్యక్తి గొప్ప లక్షణాల ఆధారంగానే జరగాలని... పలానా వ్యక్తి అయితేనే గెలుస్తాడు అనే ధోరణితో జరగరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలవాలని... వారికి ఓటు వేయాలో, వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని సూచించింది.

తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడానికి, పార్టీలలో కీలక బాధ్యతలను చేపట్టకుండా చూసేందుకు చట్టాలను మార్చాలంటూ 2018 సెప్టెంబర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచనలను కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ బీజేపీ నేత, లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా... అభ్యర్థుల నేర చరిత్రను ప్రచురించినంత మాత్రాన ఎలాంటి ప్రభావం ఉండదని... క్రిమినల్ కేసులు ఉన్నవారికి టికెట్లు ఇవ్వబోమని రాజకీయ పార్టీలు ప్రకటించడం వల్ల ఉపయోగం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.
Supreme Court
Political Parties
Political Leaders
Poll Candidates
Criminal Cases
Elections

More Telugu News