Jagan: 'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్

  • బస్సులో మహిళకు తోటి ప్రయాణికుడి నుంచి వేధింపులు
  • దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన మహిళ
  • ఏడు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్న మొబైల్ పోలీస్ పార్టీ
AP CM Jagan appreciates state police

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశ యాప్ అప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న ఓ ఎక్సైజ్ ఉద్యోగిని తనకు సహ ప్రయాణికుడి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.

ఆమె ఎస్ఓఎస్ బటన్ నొక్కడంతో, ఆ సంకేతాలను మంగళగిరిలోని పోలీస్ కంట్రోల్ రూం స్వీకరించింది. ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున 4 గంటలకు. పోలీసులు కేవలం 7 నిమిషాల్లోనే బాధితురాలి వద్దకు చేరుకుని ఆమెను భౌతికంగా వేధిస్తున్న ఓ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్ పోలీసుల సత్వర స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. యావత్ పోలీసు విభాగాన్ని అభినందిస్తున్నానంటూ చప్పట్లు కొట్టారు. "ప్రభుత్వ పథకాలు సవ్యంగా అమలవుతున్నాయని చెప్పడానికి ఈ ఘటన ఓ నిదర్శనం అని గౌతమ్ అన్న వెల్లడించిన సమాచారంతో స్పష్టమవుతోంది. బాధిత మహిళ ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే ఏడు నిమిషాల్లో మొబైల్ పోలీస్ పార్టీ సంఘటన స్థలానికి చేరుకున్నందుకు పోలీసులందరికీ నా అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News