గాలిపటం కోసం వెళ్లి గోదాములో పడిన వ్యక్తి.. వారం రోజులపాటు తిండీ తిప్పలు లేకుండా మగ్గిన వైనం!

  • హైదరాబాద్, ఓల్డ్‌బోయిన్‌పల్లిలో ఘటన
  • తనను రక్షించాలంటూ చేసిన ఆర్తనాదాలు గోదాముకే పరిమితం
  • వారం రోజులు తిండి లేకున్నా మృత్యుంజయుడిగా బయటకు
గాలిపటం కోసం గోదాముపైకి ఎక్కి ప్రమాదవశాత్తు అందులో పడిపోయిన వ్యక్తి.. వారం రోజుల తర్వాత మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. హైదరాబాద్, ఓల్డ్‌బోయినపల్లి ప్రాంతంలో జరిగిందీ ఘటన. స్థానికుల కథనం ప్రకారం.. హస్మత్‌పేట మసీదు సమీపంలో నివసించే వహీద్ (32) లారీ క్లీనర్. ఈ నెల 15న సంక్రాంతి సందర్భంగా స్థానికులు గాలిపటాలు ఎగరవేశారు. ఈ క్రమంలో వహీద్ ఇంటి సమీపంలో ఉన్న గోదాముపై ఓ గాలిపటం పడింది. అది చూసిన వహీద్ దానిని తీసుకొచ్చేందుకు గోదాంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోదాములో పడిపోయాడు.

కిందికిపడి తీవ్రంగా గాయపడిన వహీద్ తనను రక్షించాలంటూ చేసిన ఆర్తనాదాలు గోదాముకే పరిమితమయ్యాయి. దానిని వారానికి ఒకసారి మాత్రమే తెరిచే అవకాశం ఉండడంతో వహీద్ అందులోనే చిక్కుకుపోయాడు. తిండీతిప్పలు లేకుండా నీరసించిపోయాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గోదాం నిర్వాహకులు దానిని తెరవగా స్పృహతప్పి పడి ఉన్న వహీద్‌ను గమనించారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో వారొచ్చి బాధితుడిని వహీద్‌గా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. వారం రోజులపాటు తిండీ, నీళ్లు తీసుకోకపోయినా ప్రాణాలతో బతికి ఉండడం విశేషమేనని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
kite
Hyderabad
godown

More Telugu News