Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐప్యాడ్ తో కొట్టిన తమ్ముడు, గొంతు పట్టుకున్న అక్క... ఉక్కిరిబిక్కిరైన కారు దొంగ!

  • అమెరికాలో ఘటన
  • కారు దొంగిలించేందుకు దుండగుడి యత్నం
  • అక్క,తమ్ముడు ధాటికి పారిపోయిన దొంగ
అమెరికాలో ఓ అక్క, తమ్ముడు తమ కారు దొంగిలిస్తున్న దుండగుడ్ని ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నారు. తమ్ముడు ఐప్యాడ్ తో దొంగను ఒక్కటిచ్చుకోగా, అక్క గొంతు పట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేసింది. వీరి ధాటికి తట్టుకోలేక దొంగ కార్లోంచి దూకి పారిపోయాడు. ఈ ఘటన చికాగో సమీపంలోని వెస్ట్ రోజర్స్ పార్క్ లో జరిగింది.

ముగ్గురు పిల్లల తండ్రి తన టయోటా హైల్యాండర్ వాహనంలో స్థానికంగా ఉన్న డొమినోస్ పిజ్జా స్టోర్ వద్దకు వచ్చాడు. తన ముగ్గురు పిల్లలను కారులోనే ఉండమని చెప్పి, తాను కారు దిగి పిజ్జా దుకాణంలోకి వెళ్లాడు. ఇంతలో ఓ యువకుడు కారులో చొరబడి డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన 16 ఏళ్ల ఇమామా మురతాబ్ అనే అమ్మాయి, "ఎవర్నువ్వు? కార్లోంచి దిగు" అంటూ గట్టిగా అరిచింది. దాంతో అతను కారును వేగంగా డ్రైవ్ చేస్తూ ముందుకు పోనిచ్చాడు. కారులోనే ఉన్న నాలుగేళ్ల తన చెల్లి ఆయేషాను చూపించినా అతడు మెత్తబడలేదు సరికదా, కార్లోంచి దూకకపోతే కాల్చివేస్తానంటూ ఆమెను బెదిరించాడు.

ఇంతలో కారులో ఉన్న ఆమె తమ్ముడు 9 ఏళ్ల హస్నైన్ చేతిలో ఉన్న ఐప్యాడ్ తో ఆ దొంగ తలపై గట్టిగా కొట్టాడు.  డ్రైవింగ్ సీటు వెనుక కూర్చున్న ఇమామా దొంగ గొంతు గట్టిగా పట్టుకుంది. అతడు కదల్లేకపోవడంతో కారులోనే ఉన్న తండ్రి ఫోన్ నుంచి 911కి కాల్ చేసింది. దాంతో పోలీసులు తనను పట్టుకుంటారన్న భయంతో ఆ దొంగ కారులోంచి దూకి ఉడాయించాడు. ఆ దొంగకు 17 ఏళ్లు ఉండొచ్చని, అతని వద్ద ఎలాంటి ఆయుధాన్ని చూడలేదని ఇమామా తెలిపింది. మొత్తమ్మీద ఆ అక్కా తమ్ముళ్లు దొంగ భరతం పట్టిన తీరు అందరినీ అచ్చెరువొందించింది.
USA
Chicago
Dominos
Pizza
Car
Borther
Sister

More Telugu News