Jagan: ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు: నారా లోకేశ్
- తెదేపా హయాంలో దేశంలోనే తొలిసారిగా ఉచిత ఇసుక విధానం
- అప్పట్లో ఇసుక కొరత వచ్చిందా?
- పనుల్లేక ఒక్క కార్మికుడైనా ఆత్మహత్య చేసుకున్నాడా?
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు విజయవాడలోని ధర్నాచౌక్లో దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గతంలో అమలు చేసిన ఇసుక విధానాన్ని మళ్లీ తీసుకురావాలని, లేదంటే ఇసుక 'మార్చ్'ను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
'తెదేపా హయాంలో దేశంలోనే తొలిసారిగా ఉచిత ఇసుక విధానం తెచ్చాం. అప్పట్లో ఇసుక కొరత వచ్చిందా? పనుల్లేక ఒక్క కార్మికుడైనా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందా? అందుకే ఉచిత ఇసుక విధానం మళ్ళీ తీసుకురావాలి. లేదంటే ఇసుక 'మార్చ్'ను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి' అని లోకేశ్ పేర్కొన్నారు.
'ఉపాధి కరవై మనోవేదనతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు. అందుకే ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.