చంద్రయాన్-2లో నేడు కీలక ఘట్టం.. ఆర్బిటర్ నుంచి విడిపోనున్న ‘విక్రమ్’ ల్యాండర్
- నేటి మధ్యాహ్నం ఆర్బిటర్ నుంచి విడిపోనున్న విక్రమ్ ల్యాండర్
- 50 మిల్లీ సెకన్లలోనే పనిపూర్తి
- వృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-2
చంద్రయాన్ -2 కక్ష్య ఇప్పుడు 119X127 కిలోమీటర్లుగా ఉంది. నేడు చంద్రయాన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న వెంటనే ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. ఈ ప్రక్రియ 50 మిల్లీ సెకన్లలోనే జరగనుండడం విశేషం. ఆ తర్వాత రేపు, ఎల్లుండి ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించి 35X97 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ నెల 7న ప్రయోగం చివరి దశకు చేరుకుంటుంది.
చంద్రయాన్-2లోని రాకెట్లను మండించడం ద్వారా దానిని కిందికి దించుతారు. 15 నిమిషాల అనంతరం విక్రమ్ జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండవుతుంది. ఇది జరిగిన 4 గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి ప్రయోగాలు చేపట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంది.