సుష్మా మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం.. మోదీ భావోద్వేగ ట్వీట్లు
- సుష్మ మృతితో దిగ్భ్రాంతిలో బీజేపీ నేతలు
- భారత రాజకీయాల్లో ఉజ్వల అధ్యాయం ముగిసింది
- కోట్లాదిమందికి సుష్మ స్ఫూర్తి ప్రదాత
సుష్మ స్వరాజ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మోదీ ట్వీట్ చేశారు. సుష్మను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన రోజని, దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముుగిసిందని మరో ట్వీట్లో పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని, ఆమె చేసిన ప్రతీ పనిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. కోట్లాదిమందికి ఆమె స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన గొప్ప నేత సుష్మ స్వరాజ్ అన్న మోదీ.. ఆమె మంచి వక్త, ఉత్తమ పార్లమెంటేరియన్ అని ప్రశంసించారు. పార్టీ కోసం ఆమె ఎంతో చేశారని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలోనూ ఆమె తన విధులకు న్యాయం చేశారని, ఈ క్రమంలో ఆమె నిబద్ధత అనితర సాధ్యమని మోదీ పేర్కొన్నారు.