అది ఫేక్ వీడియో.. కర్ణాటక అసెంబ్లీలో బోరున విలపించిన బీజేపీ ఎమ్మెల్యే!
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింబావలి వీడియోలు
- రాజకీయ కుట్రలో భాగమేనన్న ఎమ్మెల్యే
- ఊరడించిన స్పీకర్
ఎమ్మెల్యే లింబావలికి సంబంధించినవిగా చెబుతున్న రెండు గే సెక్స్ వీడియోలు బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లింబావలి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వీడియోలపై రెండు కేసులు కూడా నమోదయ్యాయి. జేడీఎస్ ఎమ్మెల్యే కేఎం శివలింగే గౌడ సభలో మాట్లాడుతూ.. కర్ణాటక రాజకీయ నాయకులు తమ చర్యలతో ఎలా ప్రజాదరణను కోల్పోతున్నదీ వివరించారు. ఇలాంటి పనిచేసినందుకు ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు.
శివలింగే గౌడ వ్యాఖ్యలకు బదులిస్తూ ఎమ్మెల్యే లింబావలి బోరున విలపించారు. సభలో ఉన్న కొందరు వ్యక్తులు తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితే మీ కుటుంబంలో వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ వీడియో వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాజకీయ కుట్రలో భాగమే ఈ వీడియో అని స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. సెక్స్ వీడియోల విషయం వ్యక్తిగతమైనదని స్పీకర్ చెబుతూ, లింబావలిని ఊరడించే ప్రయత్నం చేశారు.