ఏడేళ్ల బాలుడికి ముక్కు సర్జరీ బదులు హెర్నియా ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుడు!
- ఫైళ్లు తారుమారు కావడంతో ఘటన
- వైద్యుడిపై వేటేసిన ఉన్నతాధికారులు
- కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో ఘటన
ముక్కులో అకస్మాత్తుగా వాపు వస్తుండడంతో ఈ ఏడాది జనవరి 7న ఏడేళ్ల హసన్‌ను అతడి తల్లిదండ్రులు కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో చేర్చారు. మే 21న వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే, ముక్కుకు బదులు కడుపు వద్ద కట్టు ఉండడంతో ఆశ్చర్యపోయిన బాలుడి తల్లిదండ్రులకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు.
ముక్కుకు బదులు హెర్నియాకు ఎలా ఆపరేషన్ చేస్తారని వైద్యులను ప్రశ్నిస్తే, అతడికి హెర్నియా కూడా ఉందంటూ తిరిగి గద్దించారు. అయితే, విషయం బయట పడకుండా ఉండేందుకు బాలుడికి మరోమారు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై తాజాగా వేటేశారు.