Sucide: మనస్పర్థలతో దూరమైన స్నేహితురాలు... యువతి ఆత్మహత్య!

  • నారాయణగూడలో ఒకే హాస్టల్ లో శ్రీదేవి, నమ్రత
  • స్నేహితురాలితో మాట్లాడని నమ్రత
  • మనస్తాపంతో శ్రీదేవి ఆత్మహత్య
వారిద్దరు ఒకరిని ఒకరు ప్రాణప్రదంగా చూసుకునే స్నేహితులు. దాపరికాలు లేకుండా అన్నీ చెప్పుకుంటూ వస్తున్న వారి మధ్య మనస్పర్థలు రాగా, ఒకరికి ఒకరు దూరమయ్యారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ యువతి, తన స్నేహితురాలు లేకుండా తాను బతకలేనంటూ, 'సూపర్‌ వాస్మోల్‌' కొబ్బరి నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్, నారాయణగూడ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఫిలింనగర్‌ కు చెందిన శ్రీదేవి (22) హిమాయత్‌ నగర్‌ లోని ఓ హాస్టల్‌ లో ఉంటూ, డిగ్రీ చదువుతుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నమ్రత, అదే హాస్టల్ లో చేరి ఆమెకు ప్రాణస్నేహితురాలైంది.

వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో గానీ, ఇటీవల ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. మూడు వారాల క్రితం స్వస్థలానికి వెళ్లిన నమ్రత, శ్రీదేవి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. గత శనివారం నాడు పరీక్ష రాసేందుకు హైదరాబాద్ కు వచ్చిన నమ్రతను బలవంతంగా హాస్టల్ కు తీసుకెళ్లిన శ్రీదేవి, ఇకపై ఎక్కడికీ వెళ్లడానికి వీలులేదని, తనతోనే ఉండాలని కోరింది. దీనికి ఒప్పుకోని నమ్రత, ఇక నీతో మాట్లాడేది లేదని తేల్చి చెప్పగా, ఇదే విషయపై శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తలపట్టుకున్న పోలీసులు, ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి, దాదాపు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు కూడా.

ఆ తరువాత హాస్టల్ కు వెళ్లిన శ్రీదేవి, ఎవరూ లేకుండా చూసి ఆత్మహత్యకు పాల్పడింది. ఒక రోజు తరువాత ఆమెను గమనించిన హాస్టల్ విద్యార్థినులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు చేరవేశారు.
Sucide
Friend
Sridevi
Namrata
Police
Hyderabad

More Telugu News