Andhra Pradesh: ఏపీలో 110 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం.. ఈ నంబర్ 120-130 వరకూ వెళ్లవచ్చు!: సీఎం చంద్రబాబు

  • టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
  • నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • అమరావతిలో టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో 18 నుంచి 20 లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకోబోతోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీకి 110 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సంఖ్య 120 నుంచి 130 సీట్ల వరకూ వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీలో నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని పునరుద్ఘాటించారు. గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు మైండ్ గేమ్స్ తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని పట్టించుకోవద్దని టీడీపీ శ్రేణులకు సూచించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను ఈసీ వివాదంగా మార్చేసిందని విమర్శించారు. రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలన్న డిమాండ్ తో రేపు ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈసీ తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియపై టీడీపీ శ్రేణులకు ఎల్లుండి మరోసారి శిక్షణ ఇస్తామన్నారు. ప్రధాని మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
teleconderence
tele conference

More Telugu News