మహారాష్ట్రలో మావోయిస్టుల పంజా.. రోడ్డు నిర్మిస్తున్న 36 వాహనాలకు నిప్పు!

  • ఇంకోసారి చూస్తే చంపేస్తామని సిబ్బందికి బెదిరింపు
  • ఆపరేషన్ లో పాల్గొన్న 150 మంది మావోయిస్టులు
  • కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతా బలగాలు
తమ కంచుకోటల్లో అభివృద్ధి పనులను మావోయిస్టులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కాదని పనులు చేపడితే తీవ్ర నష్టం కలుగజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై మావోయిస్టులు కన్నెర్ర చేశారు. దాదాపు 36 భారీ వాహనాలకు నిప్పు పెట్టారు. మరోసారి ఇక్కడ కనిపిస్తే ప్రాణాలు దక్కవని కార్మికులు, నిర్మాణ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

గడ్చిరోలిలో పనులు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 150 మంది మావోయిస్టులు చేరుకున్నారు. అనంతరం తుపాకులతో బెదిరించి కాంట్రాక్టర్లు, కార్మికులు, వాహనదారులను ఓ చోట బంధించారు. ఆ తర్వాత అన్ని వాహనాలపై పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు.

కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు మావోయిస్టులు కరపత్రాలను వదిలిపెట్టారు. కాంట్రాక్టర్ల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాదాపు రూ.10 కోట్ల వరకూ నష్టం జరిగినట్లు తెలిపారు.
Go Back to Shorts
Maharashtra
gadchirolli
Fire Accident
36 vehicles

More Telugu News