పాక్ చెరలోని అభినందన్ క్షేమంగా వచ్చేనా? జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?
- నిన్న పాక్ సైన్యానికి పట్టుబడిన అభినందన్
- విడిచిపెట్టాలని పాక్ కు లేఖ రాసిన భారత్
- క్షేమంగా వస్తాడనే అంటున్న రక్షణ రంగ నిపుణులు
రెండో ప్రపంచ యుద్ధంలో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం తరువాత, 1949లో ఈ ఒప్పందం కుదరగా, 196 దేశాలు సంతకాలు చేశాయి. వాటిల్లో ఇండియా, పాకిస్థాన్ కూడా ఉన్నాయి. ఆపై దీన్ని మూడుసార్లు సవరించారు కూడా.
ఈ ఒప్పందంలో భాగంగా, గాయపడి శత్రు దేశానికి చిక్కిన సైనికులను జాతి, మత, లింగ, వివక్షలకు తావు లేకుండా సాయం అందించాలి. వారిని హింసించడం వంటి పనులు చేయకూడదు. సరైన న్యాయ విచారణ లేకుండా మరణశిక్ష సహా ఎటువంటి శిక్షలూ వేయరాదు. వారికి పూర్తి వైద్య చికిత్స అందించాలి. రక్షణ కల్పించాలి.
ఒకవేళ యుద్ధ నౌకలో పట్టుబడితే, వారికి వైద్య సాయం అందిస్తూ, ఆసుపత్రి ఓడలకు తరలించాలని జెనీవా ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇక పట్టుబడిన వారి పేరు, సైన్యంలో వారి ర్యాంకు, నంబర్ మినహా మరే వివరాలూ తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. సైన్యానికి సంబంధించిన రహస్యాలు చెప్పాలంటూ మానసికంగాగానీ, శారీరకంగాగానీ హింసించకూడదు. ఒకవేళ పౌరులు పట్టుబడినా ఇదే విధమైన సాయం చేయాల్సివుంటుంది.
జెనీవా నిబంధనలు స్పష్టంగా ఉండటంతో, వీటిని ప్రస్తావిస్తూ, అభినందన్ ను తిరిగి ఇండియాకు పంపాలని భారత్ అభ్యర్థిస్తోంది.