వివాహితపై కన్నేసి వేధించిన యువకుడు.. వెంటపడి రాళ్లతో కొట్టిచంపిన భర్త!
- తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఘటన
- మహిళను వేధిస్తున్న డిగ్రీ విద్యార్థి
- పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు
జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రమణతండాకు చెందిన హరీశ్(19) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను అదే తండాకు చెందిన సునీతను గతకొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయంలో సునీత భర్త చంటితో హరీశ్ కుటుంబ సభ్యులకు గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో నిన్న పొలంలోకి సునీత వెళ్లగా, ఆమె వెనకాలే హరీశ్ వచ్చాడు. ఇది చూసిన భర్త చంటి కోపం పట్టలేకపోయాడు. హరీశ్ పై రాళ్లతో దాడిచేస్తూ తరుమాడు. చివరికి హరీశ్ ఆ రాళ్ల దెబ్బలతో పరిగెత్తలేక పడిపోవడంతో ఓ బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.