అమరావతిలో 8వ శ్వేతపత్రం విడుదల.. కేసీఆర్ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు!
- గ్రామీణ, పట్టణ అభివృద్ధిపై వైట్ పేపర్
- 2022 నాటికి ప్రతీకుటుంబానికి 70 లీటర్ల నీరు
- మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం
ఏపీలో 2020 నాటికి అందరికీ సురక్షితమైన మంచినీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2022 నాటికి ప్రతీ కుటుంబానికి సగటున రోజుకు 70 లీటర్ల మంచినీటిని అందించగలమని వెల్లడించారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 325 గ్రామాల్లో నీటి వసతిని కల్పించామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.15,874 కోట్లతో ప్రతీ కుటుంబానికి రోజుకు 70 లీటర్ల మేర నీటిని అందిస్తామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో కేవలం 46 శాతం మంది ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏకంగా రూ.56,000 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అయినా నీళ్లు ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
అలాంటి వారు పాలన ఎలా చేయాలో తనకు చెబుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.