సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆఫీసుపై జీఎస్టీ అధికారుల దాడులు!
- రూ.73.5 లక్షల పన్ను చెల్లించని మహేశ్ బాబు
- ఇప్పటికే బ్యాంకు అకౌంట్లను జప్తు చేసిన జీఎస్టీ కమిషనర్
- రెండు న్యాయస్థానాల్లో మహేశ్ కు దక్కని ఊరట
తాజాగా హైదరాబాదులోని మహేశ్ బాబు ఆఫీసుపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం మహేశ్ ఆఫీసుకు చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఈ పన్ను వివాదంపై మహేశ్ బాబు ఛార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు గతంలో పన్ను వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించారని తెలిపారు.
అక్కడ చుక్కెదురు కావడంతో మహేశ్ హైకోర్టును ఆశ్రయించారని వెల్లడించారు. అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో తాజాగా జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. యాక్సిస్ బ్యాంకులో మహేశ్ ఖాతాలో ఉన్న రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నామనీ, ఇంకో 30.5 లక్షలను వసూలు చేయాల్సి ఉందని అన్నారు.