మెట్ పల్లిలో నాపై హత్యాయత్నం జరిగింది.. 3 రోజుల ముందే స్కెచ్ వేశారు!: మధుయాష్కీ
- హత్యా యత్నం తర్వాత కవిత స్థానిక నేతలతో మాట్లాడారు
- కేసీఆర్ పాలనకు చరమగీతం పాడబోతున్నారు
- గాంధీభవన్ లో మాట్లాడిన కాంగ్రెస్ నేత
ఎన్నికల నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లికి వెళ్లినప్పుడు తనపై పక్కా ప్రణాళికతో హత్యాయత్నం జరిగిందని మధుయాష్కీ ఆరోపించారు. ఇందుకోసం దుండగులు 3 రోజుల ముందే స్కెచ్ వేసి ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో పెట్రోల్ బాంబులు, రాడ్లతో తనను హతమార్చే కుట్ర జరిగిందని తెలిపారు. అయితే అదృష్టం కొద్దీ తాను ఈ దాడి నుంచి తప్పించుకోగలిగానని వ్యాఖ్యానించారు.
ఈ దాడి జరగగానే కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడారని వెల్లడించారు. పోలింగ్ సందర్భంగా వంశీచంద్ రెడ్డి సహా పలువురిపై దాడులు జరగడం దారుణమన్నారు. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణను అప్రజాస్వామికంగా పాలించిన కల్వకుంట్ల కుటుంబానికి నిన్నటి ఎన్నికలతో కాలం చెల్లిందని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.