ఫాంహౌస్ కు వెళ్లిపోయే కేసీఆర్ కు ఓటేసి మళ్లీ పిలవొద్దు!: కోదండరాం
- టీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం
- వాళ్ల భూములను చెట్ల పేరుతో లాక్కున్నారు
- భూపాలపల్లి సభలో విమర్శలు గుప్పించిన టీజేఎస్ అధినేత
ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్ కు వెళుతున్న కేసీఆర్ ను మళ్లీ ఓటేసి పిలవొద్దని తెలంగాణ ప్రజలకు కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో సామాన్యులతో పాటు కార్మికులు, రైతుల జీవితాలను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్..గత నాలుగున్నరేళ్లుగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో ప్రజాకూటమిని గెలిపిస్తే కుటుంబపాలన ఉండదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన ముంపు బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మహాకూటమితోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.