మనస్తాపంతో ఈవెంట్‌ మేనేజర్‌ ఆత్మహత్య...ప్రేమికురాలితో విభేదాలే కారణం?

  • నెలరోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఘటన
  • నాలుగు రోజుల క్రితం యువతితో వాగ్వాదం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి బంధువులు
ప్రేమికురాలితో వాగ్వాదం, ఆమె బంధువుల ప్రవర్తన, పోలీసు కేసులతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం ప్రేమించిన అమ్మాయితో వాగ్వాదం జరగడం, ఆ తర్వాత పరిణామాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

పోలీసుల కథనం మేరకు...జగద్గిరి గుట్ట రోడామిస్త్రీనగర్‌ సమీపంలోని సుభాస్‌చంద్రబోస్‌ నగర్‌కు చెందిన విజయకుమార్‌, బేబీ దంపతుల రెండో కుమారుడు  కార్తీక్‌ (26) ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా సూరారం ప్రాంతానికి చెందిన యువతితో కార్తీక్‌ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. నాలుగు రోజుల క్రితం యువతి ఇంటి వద్ద ప్రేమికులు ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అనంతరం యువతి బంధువులు కార్తీక్‌పై దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రేమికులు ఇద్దరినీ శుక్రవారం పిలిపించి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించాం’ అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ముభావంగా ఉన్న కార్తీక్‌ మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో విదేశాలకు వెళ్లేందుకు కార్తీక్‌ ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

suicide
jagadgirigutta

More Telugu News