శునకాన్ని తొక్కించిన ఆటో.. డ్రైవర్ వెంటపడి మరీ నరికిన యజమాని!
- దేశ రాజధానిలో ఘటన
- పొరపాటున కుక్కను తొక్కించిన డ్రైవర్ రాణా
- కత్తిదాడితో ఆసుపత్రిలో చికిత్స
ఢిల్లీకి చెందిన విజేంద్ర రాణా ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆటో నడుపుతుండగా, ఓ శునకం ఎదురుగా వచ్చింది. వాహనాన్ని అదుపు చేయలేకపోయిన రాణా దానిపైకి ఎక్కించేశాడు. దీంతో సదరు కుక్క యజమాని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఓ కత్తి తీసుకుని రాణాతో పాటు ఆటోలో ఉన్న అతని సోదరుడి వెంట పడ్డాడు. చివరికి ఆటోను ఆపి మరీ వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అన్నదమ్ములను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.