ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవికి చందాకొచ్చర్ రాజీనామా!
- వీడియో కాన్ వ్యవహారంతో ఊడిన పదవి
- అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ తప్పుకున్న బ్యాంకర్
- కొనసాగనున్న సీబీఐ, ఐటీ విచారణ
కొచ్చర్ రాజీనామాకు ఆమోదం తెలిపిన ఐసీఐసీఐ బోర్డు సందీప్ భక్షీని కొత్త ఎండీ, సీఈవోగా నియమించింది. భక్షీ ఇప్పటివరకూ తాత్కాలిక సీఈవోగా ఉన్నారు. కాగా, కొచ్చర్ రాజీనామాను ఈరోజు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా బీఎస్ఈకి తెలియజేశారు. కొత్త ఎండీ, సీఈవో సందీప్ భక్షీ ఈ పదవిలో 2023, అక్టోబర్ 2 వరకూ కొనసాగనున్నారు. వీడియోకాన్ రుణంపై వివాదం తలెత్తగా తొలుత స్పందించని బోర్డు, ఆ తర్వాత కొచ్చర్ ను సెలవుపై పంపింది.
ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసును ప్రస్తుతం సీబీఐ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికితోడు ఈ ఘటనపై కంపెనీ బోర్డు ఇప్పటికే స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కాగా, చందాకొచ్చర్ రాజీనామా కంపెనీ షేర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మధ్యాహ్నం 2.20 గంటల నాటికి బీఎస్ఈలో ఐసీఐసీసీ బ్యాంకు షేర్లు 4.7 శాతం, ఎన్ఎస్ఈలో 4 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.